9, నవంబర్ 2018, శుక్రవారం

ప్రజాస్వామ్యం మన పాదుకలు కావాలి

అయ్యలార... అమ్మలార
మా అయ్య చంద్రబాబు
కరుణానిధి కొడుకు స్టాలిన్ ని కలిశాడు
దేవెగౌడని తన కొడుకు కుమారా స్వామి నీ కలిశాడు
సోనియా సుపుత్రుడు రాహులు నీ కలిశాడు
ములాయం కొడుకు అఖిలేష్తో మాట్లాడాడు
కలిసి బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేస్తుందో
సవివరంగా మనవి చేసాడు
ఎలా ? ఇలా అయితే ఎలా ?
మన వంశాలు , వంశాంకురాలు లేకపొతే ఎలా
ఈ దేశం ఎలా బాగుపడుతుంది ?
దేశానికి దిక్కెవరు ? మన వంశాలకి వశమయ్యేదెవరు?
ఈ దేశపు ప్రజాస్వామ్యం నడిచేదెలా ? ఎలా ?
మోడీకేమి తెలుసు పుత్ర వాత్సల్యం ?
వానికేమి తెలుసు కడుపు తీపి కక్కుర్తి ?
మన కడుపు తీపి తరువాతే
దేశమయినా, దేవుడయినా
ఈ నేల, ఈ భూమి, ఈ పుడమి , ఈ థర్తి,
తరతరాలుగా, అనాదిగా, అనాధగా
మొఘలుల శృంఖలాలలో
తెల్లవారి తుపాకులతో
బానిస బ్రతుకలలో మ్రగ్గినది
కొత్తగా , సరికొత్తగా
ఇపుడెందుకు ప్రజలు మారాలి
అదే వూడిగం చేస్తూ , అవే పల్లకీలు మోస్తూ
తరించాలి వారు, తందానా అంటే
తందానా  అని తలలూపాలి వారు
ప్రజాస్వామ్యం పరడవిల్లాలి
ప్రజాస్వామ్యం మన పాదుకలు కావాలి

15, ఆగస్టు 2016, సోమవారం

దేశభక్తి అంటే....


మొక్కవేసి చెట్టును చేయటం దేశభక్తి

చెత్తను రహదారిలో వేయకుండటం దేశభక్తి

 చెత్త తీయకుంటే ప్రభుత్వాన్ని నిలదీయటం దేశభక్తి 

 క్యూ లో నించోటం దేశభక్తి

క్యూ లో నించోని వాడ్ని నిలదీయటం దేశభక్తి

 ఎదుటవారిని గౌరవించటం దేశభక్తి

 నదుల్లో కుళ్ళుకాలవలు మళ్ళించకుండటం దేశభక్తి

 ఓటువెయటం దేశభక్తి

 ఓటు అమ్మకుండటం దేశభక్తి

 ఓటు కొనకుండటం దేశభక్తి

 రాజకీయాల్లో గుడ్డిగా వారసత్వన్ని పోషించకుండటం దేశభక్తి

 శుష్క వాఘ్దానాలు చేకుండుట దేశభక్తి  

 ప్రభుత్వ పాఠశాలల స్థాయి పెంచటం దేశభక్తి 

 ప్రభుత్వ ఆశుపత్రుల స్థాయి పెంచటం దేశభక్తి  

 బోరు బావులలొ భావి పౌరులు పడకుండా చేయటం దేశభక్తి  

 తాప్ప తాగి వాహనాలు నడిపేవాడ్ని జైల్లో వేయటం దేశభక్తి

 అమ్మాయిలను వేధించేవాడ్ని చెప్పుతో కొట్టటం దేశభక్తి

మనం వాగ్దానం చేద్దాం....
మనవి శుష్క వాగ్దానాలు కానీయరాదని మనవి చేద్దాం

స్వచ్ఛ, స్వస్థ, స్వతంత్ర భారతానికి

  జైహింద్

27, జూన్ 2016, సోమవారం

హైటెక్ సిటీ సిసి టీవీల్లో చావు లైవ్ టెలీకాస్టు!
ప్రపంచ స్థాయి మహా నగరంలో
ప్రపంచ స్థాయి మాన్ హోళ్ళు

మహా నగరారణ్యంలో మాన్ ఈటర్లు
ఊహాతీతమైన నగర నడి సమాథులు!

పడి చచ్చేందుకు చక్కగా తవ్విన గొయ్యలు
కరెంటెట్టి మరీ చావు ఖాయపరచిన అయ్యలు!

పోటెత్తిన అథికార్ల సమన్వయ పరాకాష్టంలో
హైటెక్ సిటీ సిసి టీవీల్లో చావు లైవ్ టెలీకాస్టు!

మృగ్యమైన భాద్యతలు సర్పాలై మింగిన వైనం
మృతుల స్మృతులు సిసీటీవీ ఫుటేజుల్లో భద్రం

ఆకాశంలో ఫ్రీ వైఫై తరంగాలు
భూమిమీద అగాధ సొరంగాలు

చుట్టూ సిసి టీవీ కెమెరాల పహారా లో
ఫట్టు మనే ప్రాణాలకు లేని సహారాలో

కాళ్ళ కింద నాలాలో కాలనాగులు
వేనోళ్ళ బంగారు తెలంగాణ సొబగులు

19, జూన్ 2016, ఆదివారం

చంద్రబాబు ఉవాచ : ఎక్కువమంది పిల్లల్ని కనండి ...

జపానుచైనాల్ని గుడ్డిగా కాపీ కొట్టేయ్
అపారంగా పిల్లల్ని ఎడాపెడా కనేయ్

థృతరాష్ఠృడే మనకిక బ్రాండ్ అంబాసిడర్
కృషితో చూపండోయ్ పడక గదుల్లో పవర్

చదవేస్తే వున్నమతి చెదలు చాల పట్టింది
చంద్రబాబు చాణక్యం పడక గదికిపోయింది

అయినా....
పిల్లలు కంటానికో పెళ్లాం కావాలి
పెళ్ళాన్ని సాకేందుకోజాబ్ కావాలి
జాబొచ్చేందుకు ఒక ఫాక్టరీ రావాలి
ఫాక్టరీలొచ్చేందుకు ప్రత్యేక హోదా తేవాలి

అసలు విషయం విడిచిపెట్టి


తలవదిలేసి తోకపట్టేడు బాబు
తలతోకాలేని మాటలేల బాబూ!

14, జూన్ 2016, మంగళవారం

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా.... పాటకి పేరడీశ్వాసకోస పీల్చుటకు ప్రాణవాయువు కావాలి
ప్రాణవాయువందకుంటే ఊపిరాడక చావాలి
చెట్టు చేమె నీకు నాకు ప్రాణవాయువిచ్చేది
పచ్చ ధనము లేనినాడు ప్రాణులన్ని చచ్చేను

మొక్క నాటారా ఒక్కటి మొక్క నాటరా
మొక్క నాటారా ఒక్కటి మొక్క నాటరా
ఈ మొక్క ఒక్కటేస్తే ప్రకృతమ్మ పులకించునురా  
మొక్క నాటారా ఒక్కటి మొక్క నాటరా

పత్రహరిత సమతూకం పుడమితల్లి సింధూరం  
పత్రహరిత సమతూకం పుడమితల్లి సింధూరం
జగమెరిగిన ఈ సత్యం మరిచిపోతె మనుగడ లేదు  
భోధి చెట్టు లేమిలో జ్ఞానమే కరువయి పోయే  
భోధి చెట్టు లేమిలో జ్ఞానమే కరువయి పోయే  
యికనైనా మేలుకోరి పచ్చదనం పెంచుదాము    

మొక్క నాటారా  ఒక్కటి మొక్క నాటరా

నాటినంత మాత్రాన ఈ మొక్క మాను కాజాలదు
సాకక పోతే వూరికె ఎండనబడి పోవును      
అండ కొంచెమిస్తే పండు ఫలమిస్తుంది
చిత్త శుద్ధి  తోడైతే సమాజమ్ము సంతసించ గలదు

మొక్క నాటారా ఒక్కటి మొక్క నాటరా

చెట్టు చేమ నాదరించి మట్టు బెట్టుట మానుమురా
చెట్టు చేమ నాదరించి మట్టు బెట్టుట మానుమురా
అలసత్వం కట్టి బెట్టి పచ్చ ధనము పెంచుమురా  
వనదేవత పాడాలి వనమంతా నవ్వాలి  
వనదేవత ఆడాలి మనమంతా నవ్వాలి  
యిప్పటికీ మారకపోతే అంతకన్న ఏం ఖర్మం
మొక్క నాటారా ఒక్కటి మొక్క నాటరా
ఈ మొక్క ఒక్కటేస్తే ప్రకృతమ్మ పులకించునురా  
మొక్క నాటారా ఒక్కటి మొక్క నాటరా