ఈ మధ్య ఎక్కడ చూసినా పాలభిషేకం క్షీరాభిషేకం అంటూ
వింటున్నాం..చూస్తున్నాం
వెనకటికి, దైవ పూజలకే ఈ
క్షీరాభిషేకాలు పరిమితం. యిపుడు రాజకీయ నాయకుల విగ్రహాలకూ, సభలు జరిపే మీటింగ్
గ్రౌండ్స్ కూ కూడ పాలభిషేకం చేస్తున్నారు.
దైవ పూజల్లొ
అభిషేకం చేసిన పాలని తిరిగి సేకరిచి ప్రసాదానికి వాడటం చేస్తున్నారు..అందులొ పాలు
వ్యర్ధం కావటంలేదు.
కానీ ఈ రాజకీయ
నాయకుల బొమ్మలకి అభిషేకం చేసే పాలన్నీ నేలపాలే. వెనకటికి
సినిమా హీరోల
కటౌట్లకి కూడా పాలతో అభిషేకం చేసిన వార్తలు విన్నాం, చూసాం.
ఎంత వ్యర్ధం ? ఎంత మూర్ఖత్వం? ఈ పాపాన్ని ఎవరు ఆపుతారు.
దీనికి కూడా ఏ హైకోర్టో, సుప్రీం కోర్టో
కలగ చేసుకుని అలా చెయ్యకూడదు అని రూలింగ్ యివ్వాలా?
యిలా పాలను అర్ధం
లేకుండా వ్యర్ధం చేసే బదులు ఆ రాజకీయ నాయకుల పేరు మీదొ, ఆ సినీ హీరోల పేరు మీదో
పేదవారికి పాలను పంచితే ఆ పనికి ఒక ఫలం పుణ్యం వస్తుంది. ఆ పాలిచ్చిన గోమాత
త్యాగానికి విలువ వుంటుంది
పాల తోడ
అభిషేకమటంచు పాలన్ నేల
పాలు చేయ మది
యెటుల ఒప్పునో! ఏమి
ఫలము దక్కు? యెవరి కడుపు నిండు? మరి
పులకరించునా
గోమాత?తన త్యాగము నేల పార
క్షీరాభిషేకమటంచు
క్షీరము నేల పారబోయ తగునా?
క్షామమున
బాలలెందరో క్షీరప్రాప్తినొందక అలమటించ !
క్షేమము జనులకు
పొసగు దారి యిదియా? ఓ జనులా
క్షణము నిలిచి
నిమిషమయినను యోచించరేమీ ?
తల్లిగోవు కడ లేగదూడ పొదివి పాలు త్రావుచుండ
పిల్ల గోవును వేరు చేసి గోమాత పాలెల్ల పిండినకూడ,
కల్ల కపటమెరుగని గోమాత వేరు బిడ్డకు కదా యని
ఉల్లము పొంగి పాలివ్వ, అభిషేకమటంచు నేలపోసెదరే !
గడ్డి గ్రాసము
సేవించి గోమాత విలువగల పాలనివ్వగ
గడ్డి మనుజులు
అభిషేకమటంచు పాల నేలపాల్చేసేరు
గడ్డు కార్యమది
పుణ్యము యివ్విధముగ సమకూర
గాడి తప్పి
నడుచుచున్నది బూజు పట్టిన మనుజ బుద్ధి
రక్త మాంసములు
పాలగ చేసి గోమాత తన
శక్తినంతను
ధారబోయ, అభిషేకమటంచు
ముక్తిదాయకమటంచు
పాల నేలపాలు చేయగ
రిక్తము కదా మన
మతులు గతులు నిక్కముగ
సులువైన పద్యాలలో కాస్త తెలివి ఉన్నవారి మనోవేదనని చక్కగా వివరించారు. ప్రస్తుతం మన రాష్ట్రం ఉద్విగ్నభరిత స్థితి (excited state) లో ఉంది. ఆ ప్రాంతం వారు చేసారని వీరు, వీరు చేసారని వారు, ఇలా అందరూ విలువైన వనరులని వృధా చేస్తున్నారు. పిల్లలదాకా ఎందుకు, అసలు మన రాష్ట్ర ప్రజానీకానికే ఆరోగ్యానికి రోజువారీ కావలసినంత పాలు కూడా లభ్యం కావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇలా వనరులు వృధాచెయ్యటం పాపం. కాని వీరిని శిక్షించడానికి ఆ యముడు కూడా భయపడుతున్నాడేమో. వీరిని నరకానికి తీసుకెల్తే అక్కడ కూడా అంధ్రా-తెలంగాణా అంటూ కొట్టుకుంటూనే ఉంటారు.
రిప్లయితొలగించండి