19, డిసెంబర్ 2012, బుధవారం

భారత మాత... మానభంగము


భీరువై పరుగెత్తి పోతున్న ఓ పడతీ ! ఆగుము  !
భయకంపితమై హడలి వెడలి పోతున్న ఓ పడతీ ! ఆగుము !.
           ....అని పరిగెత్తుతున్న ఆమెను ఆపేందుకు ప్రయత్నించింది ఓ గొంతు...

వలదు! వలదు ! నా దరికి రావలదు !
వలువలూడి, విలువ పోయి, వడలి పోయితిని  
వలదు! వలదు ! నా దరికి రావలదు !
అలసి పోయి, అమ్ముడుబోయి, అరవలేని గతి లొ వున్నాను 
....అని ఆ వనిత రోదించు చున్నది

ఎవరు నీవు? ఈ స్తితి లొ ఏల నున్నావు?
ఈ చిరిగిన చీర ఏమిటి ? దేహమున ఆ రక్త ధారలేమిటి ? ఎవరవు నీవు ?

నేను ...నేను... నేనొక అమ్మను ...నా కొమరులచే ...కొట్ట బడ్డ తల్లిని
నన్ను భారత మాత అంటారు వాళ్ళు... అపుడపుడూ...
నన్ను భారత మాత అంటారు... అపుడపుడూ...ఆగస్టు పదిహేనునా, జనవరి యిరవై ఆరునా

అలానా.. అయ్యో యిపుడెక్కడకు ఈ పరుగు?

నా కూతుళ్ళను చంపేస్తున్నారు, నా కుమార్తెల మీద అత్యాచారము చేస్తున్నారు
నా కోడళ్లను నరికేస్తున్నారు, నా మనుమరాళ్ళను చిదిమేస్తున్నారు 
నా చిట్టి తల్లులను కాపాడు కోవాలి ...కాపాడు కోవాలి

అలానా....ఎందుకలా చేస్తున్నారు ? నీ కూతుళ్ళు ఏమి తప్పు చేసారు?

తప్పా?... తప్పా?...ఏమి చేయ లేదు వాళ్ళు .
ఆ ...ఆ...ఒక పెద్ద తప్పే చేశారు ..వాళ్ళు ...ఆడ కూతురిగా పుట్టారు ..

ఆగు..ఆగాగు .. ఆ పరుగాపు ? ఎక్కడికా పరుగు ?


వెళ్ళాలి ..వేగరము ..వెళ్ళాలి
చెరిపబడిన నా కూతుళ్ళ మానము, గాయము చూడాలి
చంపబడిన నా కూతుళ్ళ శవాలు దహనం చేయాలి
వెళ్ళాలి ..వేగరము ..వెళ్ళాలి
బస్ స్టాండు లోనూ, బజారులోనూ ఏడి పిస్తారు
బస్ లోనూ, రైల్లోనూ వారి ఒళ్ళు తడుముతారు
తాగి యింటికి వచ్చి భార్యని చితక కొడతారు

సినిమాల్లో కళ అనే పేరుమీద వాళ్ళ వొళ్ళంతా నగ్నంగా చూపిస్తారు
డాన్సులనే పేరు మీద బట్టలే లేకుండా చేస్తారు
ప్రేమించలేదని ఒకడు ఒక కూతుర్ని విజయవాడ లొ గొడ్డలి పెట్టి నరికేశాడు
యింకొకడు శరీరము అర్పించ లేదని ఒక కూతుర్ని రాజమండ్రి లొ కొడవటి కత్తితో చీరేసాడు
మరొకడు వరంగల్ లొ ఒక కూతురి మొఖం మీద ఆసిడ్ పోసేసాడు
మొన్ననే నా యింకో కూతుర్ని డిల్లీ లొ చెరిచి, యినప రాడ్లతో కొట్టి బస్ లోంచి తోసేశారు


ఆగు..ఆగాగు ..యింత ఘోరమా ?

యింత అని కొంత అని చెప్పలేను, నా కూతుళ్ళు పడుతున్న భాధలు !
ఆడపిల్ల పుట్టిందని కొంతమంది ఆసుపత్రి పక్క చెత్త కుండీ లొ వేసేస్తారు
అయిదు సంవత్సారాల నుండి ఏభయ్ ఏళ్ళ వాళ్ళని మానభంగం చేస్తారు
కొంతమందిని బొంబాయి, కలకత్తా వ్యభిచార కూపాల్లో అమ్మేస్తారు
యింకొంత మందిని దుబాయ్ లొ అమ్మేస్తారు
పేరుకే నన్ను భారత మాత అంటారు.. అడుగడుగునా నన్ను చెరిచేస్తున్నారు


ఆగు..ఆగాగు ..మరి నీ కొడుకుల్లో కొంతమంది అయినా మంచి వాళ్ళు లేరా ?

లేకేం వున్నారు ..మంచి వాళ్ళంటే వారికి వారు ఏమీ చెడు చేయరు...కానీ మంచి కూడా చెయ్యరు
లేకేం వున్నారు ..కాని వాళ్ళని చూస్తే, “చెడ్డ వాడి దౌష్ట్యం కన్నా, మంచి వాడి మౌనం భయంకరం’’, అనే వాఖ్య గుర్తొస్తుంది
లేకేం వున్నారు, కాని వారంతా, “మనకెందుకులే ...తలనొప్పి”, అనుకునే వాళ్ళే
అనకూడదు కానీ , “తన దాకా వస్తే గానీ, తెలియదనీ అన్నట్లు...”
లేకేం వున్నారు ....కొంత మంది మంచి పోలీసులున్నారు, కాని వారికి రాజకీయనాయకుల  చుట్టూ తిరగటంతో సరిపోతుంది
వెళ్ళాలి ..వేగరము ..వెళ్ళాలి
చెరిపబడిన నా కూతుళ్ళ మానము, గాయము చూడాలి, కాపాడాలి

“ఆగు..ఆగాగు.. నేను నీకు సహాయం చేస్తాను, నీ కూతుళ్ళను కాపాడుతాను”

యింతకీ నీ వెవరవు ? నా కూతుళ్ళను కాపాడే శక్తి నీ కున్నదా ? నీ వెవరవు

“నేను దైవాన్ని ...నేను దైవాన్ని “

దైవమా అంటే నీవు దేవుడవా ? దేవతవా ?
దేవతవైతే నీవూ ఆడదానివే, యిక నువ్వేం కాపడతావు ? నన్ను నా ఆడ కూతుళ్ళను .
దేవుడవైతే నువ్వూ ఒక మగాడివే, నువ్వేమీ కాపాడవు..కాపాడవు   

నేనే కాపాడుకుంటా నా కూతుళ్ళను నేనే కాపాడుకుంటా
భారత మాతను నేను .భారత మాతను నేను

వేల జాన్సీ లక్షీ భాయిలను లను నే సృస్టిస్తా
వేల జాన్సీ లక్షీ భాయిలను లను నే సృస్టిస్తా

వేయి వేల సరోజినీ నాయుడులను సృస్టిస్తా
వేయి వేల సరోజినీ నాయుడులను సృస్టిస్తా

వేయి వేల కిరణ్ బేడీ లను సృస్టిస్తా
వేయి వేల కిరణ్ బేడీ లను సృస్టిస్తా

దుష్ట దుశ్సాసనులను అణిచేస్తా
కీచకుల కీళ్ళు విరిచేస్తా

దుష్ట దుశ్సాసనులను అణిచేస్తా
కీచకుల కీళ్ళు విరిచేస్తా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి